రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడులుగా తీసుకురావాలని సీఎం చంద్ర బాబు లక్ష్యం నిర్దేశం చేసుకున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు వివిధ రంగాల్లో 9 లక్షల కోట్లు పైగా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనించాల్సిన విషయం.
వాస్తవానికి ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు రావడం ద్వారా ఆయా రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించిన పెట్టుబడులు బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటి పరిణామాలనే ఏపీలోనూ అనుసరించాలని, పెట్టుబడులను తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని చంద్రబాబు లక్ష్యంగా ఎంచుకున్నారు.
ఈ విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. ఆయా రంగంలో పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రం కూడా సహకారం అందించాలి. ఎందుకంటే ఈ రెండూ కూడా కేంద్రం పరిధిలోని అంశాలు. వైమానిక అంతరిక్ష రంగం, డిఫెన్స్.. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ ఉన్న నేపథ్యంలో వీటికి అనుమతులు రావడం పెద్ద ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కాబట్టి చంద్రబాబు లక్ష్యం సాధ్యమైనంత వేగంగా నెరవేరుతుందని ఆయన రంగాలకు చెందిన వారు చెబుతున్నారు.
ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి వస్తే ఐఐటి, త్రిబుల్ ఐటీ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు చేకూరుతా యి. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు వస్తే ఆయుధ తయారీ సహా ఇతర కీలక అంశాలకు సంబంధించి రాష్ట్రం అభివృద్ధిలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు రంగాల్లోనూ చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం బాగుందని అభిప్రాయం వినిపిస్తోంది. దీనివల్ల సంపద సృష్టికి మార్గాలు మెరుగవుతాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఆరు మాసాలు ఆగితే తప్ప చెప్పలేం.