బాహుబలి సినిమాతో కట్టప్పగా జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తమిళ నటుడు సత్యరాజ్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇవ్వడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తమిళనాడులో `మురగన్ భక్తుల మహానాడు` పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభలో అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించడమే కాక నకిలీ సెక్యులరిజం పై పవన్ నిప్పులు చెరిగారు.
సెక్యులర్ పదం చాలా మందికి అర్థం కావడం లేదు. సహజంగా నాస్తికులకు ఏ దేవుడ్ని నమ్మరు. కానీ మన దేశంలో కొందరు హిందూ దేవుళ్ళనే నమ్మం అంటున్నారు. హిందువులను తిడితే కోప్పడకూడదని అంటారు. ఏమన్నా అంటే వాక్ స్వాతంత్ర్యం అంటారు. ఇది మారాలి అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట అగ్గి రాజేశాయి. మతం పేరిట తమిళనాడులో పవన్ చిచ్చు పెడుతున్నారని ఇప్పటికే పలువురు నాయకులు ఆయన మండిపడ్డారు.
తాజాగా నటుడు సత్యరాజ్ కూడా స్పందిస్తూ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరు అడ్డుపెట్టుకుని తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ సత్యరాజ్ హెచ్చరికలు జారీ చేశారు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశామని మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని సత్యరాజ్ ఎద్దేవా చేశారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలు తెలివైనవారు.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు సత్యరాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సత్యరాజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.