రాజకీయాల్లో ఎంత సీనియార్టీ ఉన్నా.. ఎన్ని సార్లు గెలిచినా.. రాజకీయ వారసత్వం వెంటాడుతున్నా.. నాయకులకు విజ్ఞత అనే కీలక అంశం ప్రధానం. దీనిని ఎవరో నేర్పేదికాదు. స్వతహాగానే అలవడాలి. వైసీపీ అధినేత జగన్ విషయాన్ని తీసుకుంటే.. ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన వరుస విజయాలు దక్కించుకున్న కుటుంబ రాజకీయ వారసత్వం కూడా.. ఘనంగానే ఉంది. కానీ, విజ్ఞత, వినయం అనే ఈ రెండు అంశాలే కొరవడ్డాయి. ఫలితంగా జగన్ గ్రాఫ్ నానాటికీ జారుడు బండపైనే ఉంది.
కానీ, ఇదేసమయంలో తొలిసారి ప్రజల్లో విజయం దక్కించుకున్నా.. మంత్రి నారాలోకేష్ మాత్రం అపూర్వ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. వారసత్వ రాజకీయాల్లో నుంచే ఆయన వచ్చినా.. వ్యక్తిగతంగా అలవరచుకున్న ఈ విజ్ఞత ఆయనను జగన్ కంటే అనేక మెట్లు పైకి ఎక్కించింది. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం.. సందర్భానుసారంగా వ్యవహరించడం వంటివి అలవడేలా చేసింది. తాజాగా ఆయన పార్టీ నాయకులకు కూడా ఇదే సూచించారు. తేల్చి చెప్పారు.
అధికారం ఉందని విర్రవీగొద్దని నారా లోకేష్ హెచ్చరించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని.. వారి కోసం కష్టపడాలని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి లోకేష్.. స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని, దాన్ని నిలబెట్టు కోవాలని నాయకులకు తేల్చి చెప్పారు. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సఖ్యతను నారా లోకేష్ నొక్కి చెప్పారు. ఇష్టానుసారం పనిచేయడం కాదని.. ప్రజలుమెచ్చేలా పనిచేయాలని సూచించారు. ఇది లేకపోతే.. ఎంత చేసినా పనిచేసినా ప్రయోజనం ఉండబోదన్నారు.