ఏపీలో జీరో పావర్టీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో ఎన్నారై భాగస్వామ్యం మరింత పెంచేలా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై, పీ4 అడ్వైజర్లుగా ఎన్నారైలను నియమిస్తామని చంద్రబాబు తెలిపారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పీ4 విధానంలో 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించామని, అందులో 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని చంద్రబాబుకు అధికారులు వివరించారు. మార్గదర్శులను, బంగారు కుటుంబాలను అనుసంధానం చేసేందుకు కాల్ సెంటర్ను సిద్ధం చేసిందని తెలిపారు. మార్గదర్శకులకు సమాచారం, గైడెన్స్ ఇచ్చేందుకు వ్యవస్థలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.
బంగారు కుటుంబంగా ఎంపిక కావడానికి ముందు, తర్వాత వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం అమలుపై ఆడిటింగ్, 3 నెలలకోసారి సమీక్ష, P4 నివేదికలను మార్గదర్శకులకు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఐఆర్లు, సెలబ్రిటీలను మార్గదర్శులుగా ఉండేందుకు ఆహ్వానించాలన్నారు.
టాప్ 100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సివోవోలు, సీఎఫ్ఓ, ఎండిలు, చైర్మన్లతో నేరుగా మాట్లాడి మార్గదర్శకులుగా ఉండాలని తానే స్వయంగా పిలుపునిస్తానని చంద్రబాబు అన్నారు. ఎన్నారైలతో వర్చువల్ గా మాట్లాడి ఆహ్వానిస్తానని, ఎన్ఆర్ఐలను పీ4 అడ్వైజర్లుగా పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. జీరో పావర్టీ, పీ4 కాన్సెప్ట్ ప్రమోట్ చేసేందుకు డిజైన్ చేసిన పలు లోగోలను చంద్రబాబు పరిశీలించారు. త్వరలో ఒక లోగోను ఎంపిక చేసి మార్చి 30వ తేదీన పీ4 తొలి వార్షికోత్సవం నిర్వహించబోతున్నామన్నారు.