సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వారి డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా, క్రమబద్ధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ పాలన, ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలు, పర్యటనలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. అటువంటి ముఖ్యమంత్రి రైతుగా మారి పొలం పనులు చేస్తే.. ఆ ఊహే అద్భుతంగా. ఈ అరుదైన ఘటన తాజాగా ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతులంతా వరి నాట్లు వేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో రైతులకు భరోసా కల్పిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పొలం పనుల్లో పాల్గొని అందరికీ షాకిచ్చారు. శనివారం ఉదయం రైతు అవతారం ఎత్తారు. ఖతిమాలోని నాగల తరైలో తన సొంత పొలంలోకి దిగి సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు.
కాడెద్దులతో నాగలి పట్టిన పుష్కర్ సింగ్ ధామి పొలాన్ని దుక్కి దున్నారు. ఆపై స్థానిక రైతులతో కలిసిపోయి ఎంతో ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో.. `మీరు గ్రేట్ సార్` అంటూ నెటిజన్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు.
మరోవైపు ధామి కూడా స్థానిక రైతులతో కలిసి ఫోటోలను పంచుకుంటూ.. `నా పొలంలో వరి నాట్లు వేస్తున్నప్పుడు రైతుల శ్రమ, త్యాగం మరియు అంకితభావాన్ని నేను అనుభవించాను. పాత రోజులను గుర్తుచేసుకున్నాను. ఆహార ప్రదాత మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, సంస్కృతి మరియు సంప్రదాయానికి వాహకుడు కూడా` అని ధామి ఎక్స్ వేదిగా పంచుకున్నారు.
#WATCH | Udham Singh Nagar: Uttarakhand CM Pushkar Singh Dhami ploughed the fields and planted paddy in Nagla Tarai, Khatima. pic.twitter.com/QniBAg1NiX
— ANI (@ANI) July 5, 2025