ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో `తమ్ముడు` ఒకటి. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే టీజర్, ట్రైలర్ మరియు ప్రమోషన్స్ ద్వారా మంచి హైప్ పెంచుకున్న తమ్ముడు.. ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. అక్కాతమ్ముడు కథతో ముడిపడిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది.
కథ, కథనంలో బలం లేకపోవడం, కొరవడిన భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలహీనతలు. కనీసం నితిన్ ఫాన్స్ ని కూడా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అందుకు తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. ట్రేడ్ పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో తమ్ముడు చిత్రం రూ. 2.50 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. అలాగే రూ. 1.60 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా ప్రాంతాల్లో కనీసం కోటి కూడా రాలేదు.
వరల్డ్ వైడ్ గా తమ్ముడు మూవీ ఫస్ట్ డే షేర్ రూ. 2 కోట్ల రేంజ్ లో ఉంది. నితిన్ గత చిత్రం `రాబిన్ హుడ్` ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి రోజు దాదాపు రూ. 3 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టింది. కానీ ఇప్పుడు దాంట్లో సగం ఓపెనింగ్ కూడా తమ్ముడుకు దక్కలేదు. తమ్ముడు ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి కనీసం ప్రమోషన్స్ ఖర్చు కూడా రాలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. బలమైన కథ లేకుండా కాంబినేషన్లు నమ్ముకుంటే నితిన్ అయినా.. ఎవరైనా బొక్క బోర్లా పడాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి తమ్ముడు రూపంలో నితిన్ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది.