టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో, కిడ్నీ డోనర్ దొరికితే కిడ్నీల మార్పిడికి అవసరమైన రూ.50 లక్షలు హీరో ప్రభాస్ సాయం చేస్తానని చెప్పారంటూ ప్రచారం జరిగింది. ఫిష్ వెంకట్ కూతురికి ప్రభాస్ పీఏ ఫోన్ చేశారని టాక్ వచ్చింది. అయితే, తాజాగా ఆ వ్యవహారంపై ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఒక మోసపూరిత ఫోన్ కాల్ వల్ల జరిగిన అపార్థమని స్రవంతి చెప్పారు. ఇకపై, ఆ అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. స్రవంతికి కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పీఏ అని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రభాస్ షూటింగ్‌లో ఉన్నారని, అరగంటలో మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ ఫోన్ కాల్ వల్ల ప్రభాస్ భారీ ఆర్థిక సాయం చేశారని ప్రచారం మొదలైందని స్రవంతి అన్నారు.