వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు షాక్ తగిలింది. ఆయన ఓటు హక్కును కోల్పోయారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో రమేష్ పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈ ప్రకారం ఎన్నికల అధికారులు చెన్నమనేని రమేష్ ఇంటికి నోటీసులు అంటించారు. ఆ నోటీసులకు చెన్నమనేని సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఓటు తొలగింపుపై గతంలోనే అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ రమేష్ సమాధానమివ్వలేదు. దీంతో, ఓటరు జాబితా నుంచి ఆయన పేరును తొలగించారు.
చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడని, ఆయన భారతీయ పౌరసత్వం చెల్లదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చాలాకాలంపాటు న్యాయపోరాటం చేశారు. ఆయన పోరాటం వల్లే హైకోర్టు తీర్పు వెలువడింది. ఒక రాష్ట్రంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, పౌరసత్వ వివాదం కారణంగా ఓటు హక్కును కోల్పోవడం దేశంలోనే ఇదే తొలిసారి అని తెలుస్తోంది.