తన పెంపుడు పిల్లి చూసుకుంటే ఆస్తి మొత్తం ఇచ్చేస్తా అంటూ 82 ఏళ్ళ ఓ వృద్ధుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పిల్లిని చూసుకుంటే ఆస్తి ఇవ్వడం ఏంటి? అసలీ ఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలను తెలుసుకుందాం పదండి. చైనాలో ప్రజలు తమ పెంపుడు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వాటిని సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా ట్రీట్ చేస్తుంటారు. కొందరైతే తమ పెంపుడు జంతువుల సంరక్షణ, ఆహారం, వైద్యం, వస్త్రధారణ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.
ఆ కోవకే చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు పిల్ల కోసం ఆస్తి మొత్తాన్ని దారపోసేందుకు రెడీ అయ్యాడు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో లాంగ్ అనే 82 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. పిల్లలు లేకపోవడం మరియు దశాబ్దం క్రితం తన భార్యను కోల్పోవడంతో అతను ఒంటరి అయ్యారు. అయితే వర్షం కురిసిన ఓ రోజు లాంగ్ తనకు రోడ్డుపై దొరికిన నాలుగు పిల్లి పిల్లలను చేరదీశాడు. వాటిలో ఇప్పుడు `జియాన్బా` అనే పిల్లి మాత్రమే లాంగ్ కు తోడుగా ఉంది.
ఇంతకాలం ఆ పిల్లిని లాంగ్ ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అతని వయసు మీద పడింది. ఒకవేళ తాను లేకపోతే జియాన్బా భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందిన లాంగ్.. తన పెంపుడు పిల్లి భవిష్యత్ సంరక్షకుడి కోసం వెతకడం ప్రారంభించాడు. అందులో భాగంగానే.. గ్వాంగ్‌డాంగ్ రేడియో అండ్ టెలివిజన్‌తో లాంగ్ మాట్లాడుతూ`నా తర్వాత నా పెంపుడు పిల్లిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునే వారికి తన అపార్ట్‌మెంట్‌తో పాటు బ్యాంకులోని పొదుపు మొత్తాన్ని కూడా ఇస్తా` అని ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. లాంగ్ ప్రకటన చూసి చాలా మంది అతని పిల్లిని దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కాగా, గతంలో షాంఘైకి చెందిన ఓ వృద్ధురాలు కూడా ఇదే విధంగా చేసింది. కన్న పిల్లలు తనను పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందుతూ సుమారు 2.8 మిలియన్ డాలర్ల ఆస్తిని తన పెంపుడు శునకాలు, పిల్లులకు రాసిచ్చేసింది.