తెలుగు సినిమాల్లో కమెడియన్, విలన్ పాత్రలతో అలరించిన నటుడు ఫిష్ వెంకట్.. కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. అతను తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ రోజూ డయాలసిస్ చేసుకుంటున్న వెంకట్‌కు.. ఇటీవల పరిస్థితి విషమించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే ప్రాణం నిలవడం కష్టమని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐతే సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ వెంకట్‌ను ఆదుకోవడం లేదంటూ మీడియాలో, సోషల్ మీడియా చర్చ జరిగింది. కానీ టాలీవుడ్లో గొప్ప మనసున్న హీరోల్లో ఒకడిగా పేరున్న ప్రభాస్.. తన టీంతో వెంకట్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి సాయం అందించడానికి ముందుకు వచ్చిన విషయం వెల్లడైంది.
ప్రభాస్ అసిస్టెంట్ తనకు కాల్ చేసిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ కూతురు వెల్లడించింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు ఎవరైనా ముందుకు వస్తే సర్జరీ చేయించడానికి సిద్ధమని ప్రభాస్ అసిస్టెంట్ చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ సర్జరీకి రూ.50 లక్షల దాకా ఖర్చవుతుందని వెంకట్ తనయురాలు చెప్పింది. ఇప్పటిదాకా రోజూ డయాలసిస్ చేస్తూ నెట్టుకువచ్చామని.. కానీ ఇక కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదని ఆమె చెప్పింది. తన తండ్రి పరిస్థితి విషమంగానే ఉందని ఆమె తెలిపింది. ఐతే కిడ్నీ దొరకడం కష్టంగా ఉందని ఆమె చెప్పింది.
తన తండ్రిది వేరే బ్లడ్ గ్రూప్ అని.. తమది వేరే గ్రూప్ అని ఆమె వెల్లడించింది. వెంకట్ సోదరులది ఒకే గ్రూప్ అయినప్పటికీ.. వాళ్లకు వేరే ఆరోగ్య సమస్యలు ఉండడంతో కిడ్నీ తీసుకోలేని పరసి్థితి నెలకొందని ఆమె చెప్పింది. కిడ్నీ డోనర్ కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తెలిపింది. సర్జరీ చేయించడానికి ప్రభాస్ సిద్ధం కాబట్టి.. ఇప్పుడు కిడ్నీ డోనర్ దొరకడమే వెంకట్‌కు సమస్య అన్నమాట.