ఏపీకి D2M టెక్నాలజీ ఫీచర్ ఫోన్..లోకేశ్ తో కుష్ టెక్ సీఈవో ఎరిక్ షిన్ భేటీ

admin
Published by Admin — July 10, 2025 in Politics, Andhra
News Image
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, పాలనలో సాంకేతికతను వినియోగించుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న అవగాహన, విజన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ వారసుడిగా రాణిస్తున్న మంత్రి లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడిగా మన్ననలు పొందుతున్నారు. ఐటీ శాఖా మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న లోకేశ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు టెక్నాలజీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు, మరో పక్క లోకేశ్...ఏపీలో పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన సరికొత్త టెక్నాలజీ ‘డీ2ఎమ్’ ను రాష్ట్రానికి తెచ్చేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నారు. డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ పితామహుడు, కొరియాకు చెందిన కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్ తో లోకేశ్ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఏపీలో ఆ కంపెనీ పెట్టి డీ2ఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్ ల తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు. మారుమూల పల్లెలు, గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలలో సేవలందించాలని ఎరిక్ షిన్ ను లోకోశ్ కోరారు.

సింగిల్ విండో విధానంలో కంపెనీకి కావాల్సిన స్థలం, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయసహకారాలందిస్తుందని లోకేశ్ తెలిపారు. డీ2ఎమ్ టెక్నాలజీ సాయంతో రాబోతోన్న ఫీచర్ ఫోన్లు, ట్యాబ్ ల తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టాలని లోకేశ్ కోరారు. డీ2ఎమ్ టెక్నాలజీని భారత్ లోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సైతం తాను మాట్లాడతానని లోకేశ్ చెప్పారు.

అసలేంటీ డీ2ఎమ్ టెక్నాలజీ?

ఇంటర్నెట్, వైఫై, సిమ్ కార్డ్ సాయం లేకుండానే ప్రజలకు లైవ్ టీవీ, ఇంటర్నెట్, కాల్స్ అందించే సరికొత్త టెక్నాలజీ ఈ డీ2ఎమ్. ముఖ్యంగా గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలతో మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలకు ఈ టెక్నాలజీ ద్వారా తయారైన ఫోన్, ట్యాబ్ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మొబైల్ డేటా, ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ ఖర్చు భరించలేని ప్రజలకు ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు, ఫోన్ కాల్స్ సేవలు అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ తక్కువగా ఉండే ప్రాంతాలలో సైతం ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో, పౌర సేవలను ఇంటివద్దకే మరింత సులభంగా తేవడంలో డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్ ఉపకరిస్తుంది. ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ లేని సమయంలో కూడా డీ2ఎమ్ ఫీచర్ ఫోన్ల ద్వారా వాతావరణం, వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వంటి వాటికి సంబంధించిన హెచ్చరికలు, విపత్తు హెచ్చరికలు వంటి వాటిని డీ2ఎమ్ టెక్నాలజీ ఫోన్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చు.

మారుమూల, గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, రైతులకు వాతావరణానికి సంబంధించిన విషయాలను నేరుగా వారికి చేరవేయడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీకి ప్రసార్ భారతి, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సహాయసహకారాలున్నాయి. డీ2ఎమ్ ఫీచర్ ఫోన్ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన కుష్ టెక్ కొరియా కో లిమిటెడ్ ఏపీలో ఆ ఫోన్ల, ట్యాబ్ ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది.

లోకేశ్ తో ఎరిక్ షిన్ బృందం జంగ్ హూన్ కిమ్, సారిన్ సువర్ణ, శశి దొప్పలపూడి, సాగర్ దొడ్డపనేని భేటీ అయ్యారు. ఈ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్, ట్యాబ్ నమూనాను లోకేశ్ కు చూపించారు. డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్, ట్యాబ్ ను చూసిన లోకేశ్...ఎరిక్ షిన్, ఆయన బృందాన్ని అభినందించారు. ఈ ఫోన్, ట్యాబ్ అందుబాటులోకి వస్తే పేదల జీవితాలు మారిపోతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Tags
minister lokesh in talks d2m technology feature phone kushtech company korean company eric
Recent Comments
Leave a Comment

Related News