టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 20 20 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనికుడు చంద్రబాబు. ఐటీ రంగం మాదిరిగానే జనాభా పెరుగుదల ఆవశ్యకతపై చంద్రబాబు కొంతకాలంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెలగపూడిలోని సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్వహించిన ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని చంద్రబాబు అన్నారు. జనాభా పెరుగుదల, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చ జరగాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనాభా పెరుగుదలపై దృష్టి సారించామని చెప్పారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని గతంలో తానే చట్టం తెచ్చానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. అందుకే, 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తాజాగా తొలగించామని అన్నారు.
ఈ రోజు జనాభా పెరుగుదలను తానే సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చూసి చులకనగా మాట్లాడేవారని, కానీ ఈ రోజు అత్యధిక జనాభా ఉన్న దేశాలకి గౌరవం ఎక్కువగా దక్కుతోందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో జనాభా తగ్గిపోతోందని, అమెరికాలో ఫెర్టిలిటీ రేటు 1.62 మాత్రమేనని...2.6 ఫెర్టిలిటీ రేటు ఉంటే రీప్లేస్మెంట్ ఉంటుందని అన్నారు. లేకపోతే జనాభా రోజు రోజుకు తగ్గిపోతుంది అని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఫెర్టిలిటీ రేటు 1.7 గా ఉందని వెల్లడించారు.