జులై 10.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు. పదేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఆ రోజును గొప్ప మలుపుగా చెప్పొచ్చు. అప్పటిదాకా ఏ భారతీయ దర్శకుడి ఊహకూ అందని ఓ అద్భుత ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించి సంచలనం రేపాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఆ సినిమాలో విజువల్స్ చూసి మైమరచిపోని ప్రేక్షకుడు లేడు. ఆ తర్వాత భారతీయ సినిమాల కథలు మారిపోయాయి.
బడ్జెట్లు పెరిగిపోయాయి. మన దర్శకుల విజన్‌లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇప్పుడు రామాయణ, మహాభారత గాథలను వేల కోట్ల బడ్జెట్లలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అందుకు పునాది వేసింది ‘బాహుబలి’నే. తొలిసారి వెండితెరపై ఈ సినిమా చూసినపుడు భారతీయ ప్రేక్షకులు పొందిన అనుభూతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడానికి బాహుబలి మళ్లీ రాబోతోంది. కొన్నేళ్లుగా టాలీవుడ్‌ను ఊపేస్తున్న రీ రిలీజ్ ట్రెండును బాహుబలి సైతం అందిపుచ్చుకుంటోంది.
అక్టోబరు 31న ‘బాహుబలి’ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఇది అన్ని సినిమాల రీ రిలీజ్ టైపు కాదు. బాహుబలి ఒక్క సినిమా కాదన్న సంగతి తెలిసిందే. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ అని రెండు భాగాలుగా విడుదలైంది. ఐతే ఫస్ట్ పార్ట్ చూసినపుడు కథను మధ్యలో ఆపేశారని ప్రేక్షకులు అసంతృప్తికి గురయ్యారు. రెండో భాగంతో కథ పూర్తయినపుడు వావ్ అనుకున్నారు.
ఇప్పుడు ఈ రెండు భాగాలనూ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం కొన్ని అప్రాధాన్య సన్నివేశాలు, పాటలను తీసేయబోతున్నారు. ఈ ఎడిటింగ్ రాజమౌళి పర్యవేక్షణలోనే జరగబోతోంది. నిన్న బాహుబలి పదో వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హంగామా, అభిమానుల ఉత్సాహం చూస్తే.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే ఈ చిత్రం రీ రిలీజైనపుడు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదని అర్థమవుతోంది.
టాలీవుడ్లో కల్ట్ మూవీస్‌ను సరిగ్గా ప్లాన్ రీ రిలీజ్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో పోకిరి, జల్సా, ఖలేజా లాంటి సినిమాలు రుజువు చేశాయి. ఇక ‘బాహుబలి’ వాటిని మించిన స్పెషల్ మూవీ కావడం.. పైగా రెండు భాగాలను కలిపి ఒకటిగా రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకుల స్పందన గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు. రీ రిలీజ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి.. భవిష్యత్తులో ఎవరూ అందుకోలేని నయా రికార్డులను నెలకొల్పడం ఖాయమని అంచనా వేస్తున్నారు.