వైవాహిక జీవితాల్లో విభేదాలు.. విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. భిన్న ధ్రువాలుగా ఉండే భార్యభర్తల మధ్య విభేదాలు కామనే అయినప్పటికి.. విడాకుల వరకు వెళ్లటం గతంలో తక్కువగా ఉండేది. మారిన కాల పరిస్థితులకు తగ్గట్లు.. విడాకుల కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకుల కేసుకు సంబంధించిన విచారణ వేళ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అనుమానంతో రహస్యంగా రికార్డు చేసిన సంభాషణలను విడాకుల కేసులో సాక్ష్యాలుగా తీసుకుంటామని స్పష్టం చేసింది. జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయటం అన్ని వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. సీక్రెట్ రికార్డింగులకు సంబంధించిన సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఇలా సాక్ష్యాలుగా ఒప్పుకోమని ఒక కేసులో పంజాబ్.. హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
సీక్రెట్ గా సాక్ష్యాల్ని రికార్డు చేస్తే.. వైవాహిక బంధాల్ని.. కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బ తీస్తాయన్న హైకోర్టు వాదనను విభేదించింది. రహస్యంగా రికార్డు చేసే ఉదంతాల్ని ప్రోత్సహిస్తే.. భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయన్న హైకోర్టు వ్యాఖ్యలకు భిన్నంగా సుప్రీంకోర్టు తన వాదనను వినిపించింది.
ఈ తరహా వాదనలు చెల్లుబాటు కావన్నది తమ అభిప్రాయంగా పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. ‘‘భార్య భర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయటం లాంటి పనులకు పాల్పడుతున్నారంటేనే.. వారి బంధం బీటలు వారిందని.. వారి మధ్య విశ్వాసం సన్నగిల్లినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో రహస్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించటం తప్పేం కాదు. ఎందుకంటే అలాంటి తీరు వారి వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్పించి వాటికి కారణం కాదు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నం స్పష్టం చేశారు.
సెక్షన్ 122లో పేర్కొన్నట్లుగా గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే కానీ అది సంపూర్ణమైనది కాదన్నారు. అందుకే ఈ అంశాన్ని ఆ సెక్షన్ కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్యను చేసింది సుప్రీం ధర్మాసనం. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పైచేయి అవుతుంది. వైవాహిక బంధం విచ్ఛిన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాల్ని సమర్పించే హక్కును గోప్యత పేరుతో చూపించి దాన్ని తీసేయలేం’’ అని వెల్లడించింది.
2017 నాటి ఒక విడాకుల కేసులో భార్యకు తెలీకుండా భర్త ఆమె చేసిన సంభాషణ రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్ లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అదే సమయంలో దానికి భిన్నంగా హైకోర్టు వాదనను కొట్టేసి.. తప్పు పట్టింది. సో.. వైవాహిక బంధాల్లో భాగస్వామి రహస్య సంభాషణల్ని రికార్డు చేసి.. సాక్ష్యాలుగా చూపిస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు స్పష్టత..మరిన్ని విడాకుల కేసులకు ఒక బలమైన వాదనగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.