ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది నేడు ఐటీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు విజన్ కారణమంటే అతిశయోక్తి కాదు. విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే వృద్ధిని 20 ఏళ్ల క్రితమే అంచనా వేసిన దార్శనీకుడు ఆయన. ప్రపంచ ఐటీ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేకమైన గుర్తింపు తేవడంలో చంద్రబాబు పాత్ర మరువలేనిది. అదే మాదిరిగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి కూడా ఆ పటంలో చోటు కల్పించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఆ క్రమంలోనే అమరావతిలో "అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)’’ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా నేడు జరిగిన సీఐఐ సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ...ఇండియాకు క్వాంటం వ్యాలీ అని చంద్రబాబు అన్నారు. అమరావతి కేంద్రంగా 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ ను ఏపీలో ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ సదస్సులో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ రోజు హైదరాబాద్ ఐటిలో దూసుకుపోవడానికి కారణం చంద్రబాబు విజన్ అని కొనియాడారు. మానవ వనరులు కోసం ఆనాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆ రోజుల్లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఆయన ఎంతో తపించేవారని, ఉదయం 6 గంటల నుంచే చర్చలు మొదలుపెట్టేవారని చంద్రశేఖరన్ గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు గారికి ఉన్న ప్యాషన్ అటువంటిదని ప్రశంసించారు.