చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్‌కు సమయం దగ్గర పడిపోయింది. ఇంకో 9 రోజుల్లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇంతకుముందు ప్రకటించిన జూన్ 12 నుంచి సినిమా వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం ఒక్కటే కారణం కాదు. సినిమా బిజినెస్ వ్యవహారాలు తేలకపోవడం కూడా కారణమే.
ఐతే కొత్త డేట్ ప్రకటించాక వదిలిన ట్రైలర్ ఇటు ప్రేక్షకులను, అటు ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. బిజినెస్ పరంగా కొంచెం జోష్ తీసుకొచ్చింది. ఓవర్సీస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో అమ్మకాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ నైజాం, రెస్టాఫ్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో బిజినెస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. నిర్మాత ఒక రేటు చెబుతున్నారు.
ఆ రేటుకు దగ్గరగా ఎవరూ నంబర్ చెప్పడం లేదు. అలా అని మరీ తగ్గించి సినిమాను ఇవ్వడానికి ఏఎం రత్నం రెడీగా లేరని తెలుస్తోంది. అవసరమైతే అడ్వాన్స్ బేస్డ్ మీద.. సినిమాను సొంతంగా రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మిగతా ఏరియాల సంగతి ఏమో కానీ.. నైజాంలో అయితే ‘హరిహర వీరమల్లు’ను రత్నమే రిలీజ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక్కడి టాప్ బయ్యర్లు ఎవరూ రత్నం కోరుకున్న రేటు ఇవ్వడానికి రెడీగా లేరు.
ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో రత్నం సొంతంగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనైతే సినిమా మీద పూర్తి ధీమాగా ఉన్నారు. కొన్ని వారాల నుంచి సరైన సినిమాలు లేని వాక్యూమ్ కనిపిస్తోంది. ప్రేక్షకులు ఓ పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
పవన్ సినిమా అంటే రిలీజ్ టైంకి రావాల్సిన హైప్ అంతా వచ్చేస్తుందని.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగుతుందని.. తాను ఆశించిన రేటుకు తగ్గట్లుగా వసూళ్లు వస్తాయని, అంతకుమించినా ఆశ్చర్యం లేదని ఆయన నమ్మకంతో ఉన్నారు. అందుకే బిజినెస్ జరక్కపోవడం వల్ల సినిమా ఆగే పరిస్థితి ఉండబోదన్నది స్పష్టం. రిలీజ్ ముంగిట కొంచెం ప్రమోషన్ల జోరు పెంచాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. అలాగే కుదిరితే రిలీజ్ ట్రైలర్ కూడా వదలాలన్న చర్చ టీంలో జరుగుతోంది.