స్నేహమే నా జీవితం..స్నేహమేరా శాశ్వతం...స్నేహమే నాకున్నది...స్నేహమే నా పెన్నిధి...అంటూ విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కైకాల సత్యన్నారాయణ పాడిన పాట వినని స్నేహితులుండరు. ముస్తఫా..ముస్తఫా...డోంట్ వర్రీ ముస్తఫా..కాలం నీ నేస్తం ముస్తఫా.. డే బై డే..డే బై డే...కాలం ఒడిలో డే బై డే...పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా...అంటూ స్నేహం విలువ చాటి చెప్పే ప్రేమ దేశం వంటి సినిమాలు చూడని మిత్రులుండరు.
అయితే, కాలగమనంలో స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...అని పాడుకునే వారు తక్కువయ్యారు. ప్రత్యేకించి అమెరికాలో సగటు యువతీయువకులకున్న ఆప్తమిత్రుల సంఖ్య గణనీయంగా తగ్తుతోంది. స్నేహంలో మాంద్యం గురించి హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురితమైన ఓ కథనం చర్చనీయాంశమైంది.
1990లతో పోలిస్తే మాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు అనే యువతీయువకుల సంఖ్య 12 శాతం పెరిగిందని అమెరికన్ పెర్ స్పెక్టివ్స్ సర్వేలో వెల్లడైంది. ఇక, 10 లేదా అంతకంటే ఎక్కువమంది ఆప్తమిత్రులున్నారు అనే వారి సంఖ్య 1/3 వ వంతు తగ్గిందట. ఒకవేళ ఇటువంటి సర్వేనే భారత్ లో చేస్తే ఫలితాలు అమెరికాలో మాదిరే వస్తాయని అంచనా. నికార్సయిన స్నేహితులు, స్నేహానికి విలువనిచ్చేవారు నానాటికీ తగ్గిపోతున్నారు అన్నది ఆ కథనం సారాంశం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బ్యాచ్ ఎక్కువయ్యారన్నమాట. చిన్న చిన్న విషయాలకే అలిగి బ్రేకప్ చెప్పే స్నేహితులు రోజురోజుకీ పెరుగుతున్నారట.
అమెరికాలో అయితే గతంలో బార్లలో అపరిచితులతో చిట్ చాట్ చేయడం సర్వ సాధారణం. కానీ, ఇప్పుడు బార్లలో కాళ్లు బార్లా జాపుకొని జనాలకు దూరంగా కూర్చొని...ఏకాంతంగా మందు కొడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారట. ఇక, అమెరికాలోని రెస్టారెంట్లలో గత రెండేళ్లుగా సోలో లైఫే సో బెటరు అంటూ సింగిల్ గా కూర్చొని తింటున్న వారి సంఖ్య కూడా ఎక్కువైందట. డిజైన్ ఫర్ హెల్దీ ఫ్రెండ్ షిప్స్ అనే కోర్సును స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ కొత్తగా ఆఫర్ చేస్తోందంటే ఈ స్నేహ మాంద్యం ఎంత ఎక్కువైందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
ఇలా జరగడానికి సామాజిక మార్పు కారణం కాదని, సంస్కృతీసంప్రదాయాలలో వచ్చిన మార్పు వల్లే ఇలా జరుగుతోందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. స్నేహితుల కోసం సమయం కేటాయించే వారి సంఖ్య తగ్గుతోందని, కానీ, స్నేహితులను తరచూ కలవడానికి ప్రాధాన్యతనివ్వాలని వారు అంటున్నారు. మనం ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో విలువైన సమయం గడుపుతున్నాం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఒంటరిగా ఉండడం..స్నేహితులకు దూరంగా ఉండడం అనే ట్రెండ్ నడుస్తోందని, ఆ ట్రెండ్ ను అంతం చేయాలని సూచిస్తున్నారు. ఆ ట్రెండ్ మారకుంటే పాత మిత్రులతో స్నేహాన్ని కొనసాగించే, కొత్తవారిని స్నేహితులుగా చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.
స్నేహితులకు ప్రాధాన్యతనివ్వకపోతే, వారిని తరచూ కలవకుంటే నష్టం ఏంటి అని మీరు అనుకుంటే పొరపాటుపడినట్లే. అలా చేయకుంటే జీవితంలో ఆరోగ్యానికి, సంతోషానికి, సంబంధబాంధవ్యాలకు మూలాన్ని కోల్పోయినట్లే. మతపరమైన కార్యక్రమాలు, రోటరీ క్లబ్బులు, క్రీడలకు సంబంధించిన జట్లు వంటివి తగ్గిపోవడం కూడా స్నేహంలో మాంద్యానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఆర్థిక మాంద్యం కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిన మాదిరిగానే..స్నేహంలో మాంద్యం యువతీయువకుల జీవితాలపై పెను ప్రభావం చూపుతోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, పెంపుడు జంతువుల సంరక్షణ వంటి పలు కారణాలతో స్నేహితులకు దూరమవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నా కోసం కేటాయించుకునేందుకే నాకు టైం లేదు..ఇక స్నేహితులకు సమయం ఎక్కడిది అనుకునేవారు ఎక్కువయ్యారు. గతంలో జీవితంలో స్నేహం ఒక అంతర్భాగంగా ఉండేది. కానీ, ఇప్పుడు చాలామంది జీవితాల్లో స్నేహం, స్నేహితులు కనీసం ఒక బాహ్య భాగం కూడా కాదు. కుదిరితే, టైం ఉంటే అప్పుడు స్నేహితులను కలుద్దాం అనుకునే బ్యాచ్ ఎక్కువయ్యారు.
ప్రముఖ రచయిత బోనీ వేర్ రాసిన ‘ది టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ది డయింగ్’ పుస్తకంలో స్నేహం యొక్క ప్రాముఖ్యతను గురించి అద్భుతంగా వివరించారు. ‘‘ నా స్నేహితులతో కలిసి ఉండి ఉంటే బాగుండేది’’ అని ఆయన రాసిన కోట్ చదివితే గుండె బరువెక్కక మానదు. మానసిక, శారీరక, భావోద్వేగపరమైన ఆరోగ్యాన్ని స్నేహం మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమాజానికి దూరంగా ఉండడం, ఒంటరితనం వల్ల గుండె జబ్బులు, చిత్త వైకల్యం, మరణాల ముప్పు పెరుగుతుందట. సామాజిక ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానమంటే నమ్ముతారా?
హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క 80 సంవత్సరాల అధ్యయనం కూడా స్నేహం ప్రాధాన్యత గురించి చక్కగా వివరించింది. జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కొలిచే అతి పెద్ద సూచీ సంపద లేదా వృత్తిపరమైన విజయం కాదని...సన్నిహిత సంబంధాలు, స్నేహాలు అని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చి చెప్పింది.
స్నేహ బంధాలు బలపడేందుకు సమయం పడుతుంది. చిరకాల స్నేహితులుగా ఉండేందుకు స్నేహితులంతా ఒకరి కోసం ఒకరు సమయం ఇవ్వాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం చేసే కృషి మాదిరిగానే స్నేహబంధం ధృఢంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో, నిజాయితీగా కృషి చేయాలి, తగినంత సమయం పెట్టుబడిగా పెట్టాలి. స్నేహ బంధం కలకాలం ఉండాలంటే రెండు విషయాలు మిత్రులంతా పాటించాలి. ఒకటి క్షమించడం..రెండు మరచిపోవడం.
మన స్నేహితుడే కదా...సారీ చెబితే ఏం పోతుంది? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే మిత్రుడికి క్షమాపణ చెప్పేందుకు వెనుకాడకండి. అహంభావాన్ని, గర్వాన్ని పక్కనబెట్టండి. స్నేహితులు వారి పనుల్లో నిమగ్నమై స్నేహం కోసం సమయం కేటాయించకుంటే వారికి ఫోన్ చేయండి. వారి బాగోగులు, ఇబ్బందులు ఏంటో అడిగి తెలుసుకోండి. 10 నిమిషాలే అయినా సరే...రోజులో ఒకసారి మిత్రులతో గడిపేందుకు రమ్మని బిజీగా ఉండే మిత్రులను ఆహ్వానించండి. సెలవు రోజుల్లో స్నేహితులందరినీ కూడగట్టి ఓ చక్కటి ప్రదేశానికి జాలీగా ఓ ట్రిప్ వేయండి.
స్నేహితులతో కలిసి చేసే ప్రయాణపు అనుభూతి వేరెవరితో చేసినా రాదని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అలా చేస్తే స్నేహాలు మరింత బలపడతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మిత్రులకు తోచినంత సాయం చేసి ఆదుకోండి. వారి పుట్టిన రోజులకు బహుమతులు ఇవ్వండి. వారి జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలను అందించండి. ఇదంతా నేనే ఎందుకు చేయాలి? నేనే ఎందుకు తగ్గాలి అని అనుకోకండి. ఇలా స్నేహాన్ని కాపాడుకునేందుకు చేస్తోందంతా స్నేహితుల కోసం కాదు...మీ కోసం..అనుకొని చేయండి.
‘‘దోస్తోం కే సాథ్ జీ లేనే కా మౌకా దే దే ఏ ఖుదా...తేరే సాథ్ తో మర్నే కే బాద్ భీ రహ్ లేంగే (స్నేహితులతో జీవించే అవకాశం ఇవ్వు దేవుడా..చనిపోయిన తర్వాత కూడా నీతో ఉండగలను)’’ అని మీర్జా గాలిబ్ అద్భుతంగా రాశారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే...ఎక్కువ మంది స్నేహితులు = జీవితంలో ఎక్కువ సంతృప్తి
స్నేహంలో మాంద్యం (అనారోగ్యం) పోవాలంటే ఆప్త మిత్రులే వైద్యం
స్నేహితులతో జీవితాంతం స్నేహం కొనసాగించేందుకు ప్రయత్నించండి..సంతోషంగా జీవించండి!
Sail in The 'FRIEND' SHIP Until You Die....!