ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలియదు కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో కలహాలు స్టార్ట్ అవ్వడం, కవిత రాసిన ఆరు పేజీల లేఖతో అవి బయటపడడం తెలిసిందే. తన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పరోక్షంగా విమర్శిస్తూ కవిత వ్యాఖ్యలు చేయడం పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖతో కవిత, కేటీఆర్‌లకు చెడిందన్న విషయం స్పష్టమైంది. వీరి మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. అన్నాచెల్లెలు ముఖాముఖాలు చూసుకోవడం మానేశారు. వీరి గొడవలను తండ్రి కేసీఆర్ పరిష్కరిస్తారని అంతా అనుకున్న కూడా ఆయనేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కవితకు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇన్‌ఛార్జీగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తాజాగా కేటీఆర్ నియమించడం జరిగింది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కేటీఆర్ సూచించారు.
బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుందని.. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చిన అండగా నిలబడతామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే కొప్పుల ఈశ్వర్ నియమకం కవితకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. బీఆర్ఎస్‌కు అనుబంధంగా ఏర్పడిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉన్నారు. కానీ కవితకు చెప్పకుండానే తాజాగా కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగింది. దీంతో పార్టీలోనే కాకుండా అనుబంధ సంఘాల్లోనూ కవితకు ప్రాధాన్యం తగ్గుతోందని ప్రచారం జరుగుతోంది.