సినిమా టికెట్ ధరల అంశం ప్రతి ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. సింగిల్ స్క్రీన్స్ కు ఒక రేటు మల్టీప్లెక్స్ థియేటర్స్ కు ఒక రేటు అన్నట్టుగా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే సినిమా బడ్జెట్ బట్టి కూడా టికెట్ రేట్లు ఆధారపడి ఉంటున్నాయి. స్పెషల్ షోలు, ప్రీమియర్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కో టికెట్ ధర రూ. 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. దాంతో సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వినోదం కోసం థియేటర్ కు వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. వినోదపు పన్ను సహా ఇకపై సినిమా టికెట్ రేటు రూ. 200 మించకుండా ఉండాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లకు కూడా వర్తిస్తుంది. అలాగే కన్నడ సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలు కూడా ఇదే రోల్ ను ఫాలో అవ్వాలని ప్రభుత్వం తెలిపింది.
సినీ పరిశ్రమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో ప్రభుత్వానికి తెలియజేయాలని కోరింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.