హిందూపురం వైసీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫ్యాన్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ అడ్డాగా మారిపోయింది. గత మూడు ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా అసెంబ్లీకి ఎన్నిక అవుతున్నారు. అయితే బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు జగన్ షాక్ ఇచ్చారు.
నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిపై వేటు వేశారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో హిందూపురం నియోజకవర్గం తొలి పార్టీ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి పని చేశారు. మరోవైపు నవీన్ నిశ్చల్ హిందూపురంలో బలమైన నేతగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో బాలయ్యపై వైసీపీ తరఫున దీపిక రంగంలోకి దిగారు. ఆ టైమ్‌లో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డారు. కానీ బాలయ్యను ఓడించలేకపోయారు.
అయితే ఇటీవల ఓ కార్యక్రమాల్లో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ టికెట్ తనకే అంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో దీపిక వర్గం ఆగ్రహానికి గురైంది. పార్టీ హైకమాండ్ కు అతనిపై ఫిర్యాదు చేసింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొండూరు వేణుగోపాల్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.