వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే విజయవాడ జైలు నుంచి విడుదల అయ్యారు. టీడీపీ ఆఫీసుపై దాడి, ఫిర్యాదుదారుడ్ని అపహరించిన వ్యవహారంలో ఫిబ్రవరి 16న వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయనపై దాదాపుగా 11 కేసులు నమోదు అయ్యాయి. 140 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన వంశీ.. ఎట్టకేలకు ఈనెల మొదటి వారంలో బయటకు వచ్చారు. అయితే వంశీ మళ్లీ అరెస్ట్ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో వంశీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మల ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది.
రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం.. ఇరువురు వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పగా.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం తేల్చిచెప్పింది. ఇక ఈ పరిణామంతో వంశీ మళ్లీ జైలుకే అంటూ ప్రచారం జరుగుతోంది.