కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే అశోక గజపతిరాజు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ కి రాజీనామా చేశారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆయా నుంచి ఇప్పటివరకు టీడీపీలో పనిచేసేందుకు ఎన్నో అవకాశాలు అందుకున్నానని.. అందుకు పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలని గజపతిరాజు పేర్కొన్నారు. త్వరలో గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు అశోక గజపతిరాజు తన రాజీనామా లేఖన పంపారు.
కాగా, రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు.. జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978 ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన అశోక్ గజపతిరాజు.. 1983 నుంచి 2009 వరకు.. ఒక్క 2004లో తప్ప శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగి విజయనగరం ఎంపీగా గెలుపొందారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో విమానయాన మంత్రిగా పనిచేసి నేషనల్ లెవల్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు పోలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగు దేశం పార్టీకి విశేష సేవలందించారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలతో క్లీన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అశోక్ గజపతిరాజును గవర్నర్ పదవి వెతుక్కుంటూ వచ్చింది.