ఏపీ రాజకీయాలలో రప్పా రప్పా రాజేసిన వేడి అంతా ఇంతా కాదు. ఆ డైలాగ్ వాడడాన్ని ఖండించాల్సిన వైసీపీ అధినేత జగన్ అదో సినిమా డైలాగ్ తప్పేంటి అంటూ సమర్థించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, రప్పా రప్పా అని పగలు అరవడం కాదని..చీకట్లో కన్నుకొడితే సైలెంట్ గా అయిపోవాలి అని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఆ డైలాగ్ కన్న ఎక్కువగా వైరల్ అయ్యాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పేర్ని నానికి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఎన్నిసార్లు చీకట్లో కన్ను కొట్టావు పేర్ని నాని అంటూ బుద్ధా ప్రశ్నించారు. పేర్ని నాని ఆకు రౌడీలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై హత్యా నేరం మోపి 53 రోజులు జైల్లో పెట్టించడం వంటివి మాత్రమే నానికి చేతనవుతాయని అన్నారు. దసరా ముందు పులి వేషాలు కట్టుకొని వచ్చేవాళ్ల మాదిరిగా పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్ లు వైసీపీ హయాంలో జనం దగ్గర దసరా మామూళ్లు వసూలు చేశారని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని బైపాస్ చేయించుకున్నాడని, కొడాలి నాని సామాన్లు బాగు చేయించుకొని వస్తారని పేర్ని నాని చెప్పాడని గుర్తు చేశారు. వంశీకి ఆల్రెడీ సామాన్లు చెడిపోయాయని అన్నారు. తమ బాస్ చంద్రబాబు తమను కంట్రోల్ చేయకుండా వదిలేస్తే ఈ పిల్ల సైకోలను ఒక్క పూటలో కంట్రోల్ లో పెడతా అంటూ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అధికారంలో ఉన్నపుడు పులి వేషాలు కట్టి ఇప్పుడు అధికారం పోగానే పిల్లల్లాగా పిరికిపందల మాదిరిగా పారిపోయారంటూ ఎద్దేవా చేశారు.