దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణపై ఇండియా టుడే, సీ-ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వేలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు దుమ్మురేపారు. దేశంలోని బెస్ట్ సీఎం లిస్ట్‌లో చంద్రబాబు మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య నిర్వహించబడిన ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.
దేశంలో టాప్-3 సీఎంలలో చంద్రబాబు:
1వ స్థానం: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ – 36% ప్రజాదరణ
2వ స్థానం: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ – 13% ప్రజాదరణ
3వ స్థానం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు – 7% ప్రజాదరణ
గత సర్వేతో పోల్చితే మెరుగైన ర్యాంక్:
దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు టాప్-3లో చోటు దక్కించుకున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఇదే సర్వేలో చంద్రబాబు 5వ స్థానంలో ఉన్నారు. కానీ తాజా సర్వేలో 2 ర్యాంకులు ఎగబాకి మూడో స్థానానికి చేరుకోవడం ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. ఈ సర్వే ఫలితాలు చంద్రబాబు పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలలో ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని మరోసారి స్పష్టంచేశాయి.
యోగి ఆదిత్యనాథ్ వరసగా మూడోసారి నంబర్ 1:
దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఇది మూడోసారి ఆయన నంబర్ వన్ కావడం విశేషం. అదేవిధంగా తాజా సర్వేలో బిహార్ సీఎం నితీష్ కుమార్ 4.3% జనాదరణతో 4వ స్థానంలో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 3.8% జనాదరణతో 5వ స్థానంలో నిలిచారు. ఇక చిన్న రాష్ట్రాల విభాగంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ టాప్ ప్లేస్‌లో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈ సర్వే జాబితాలో ప్రస్తావించబడలేదు.