నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర పట్టుబడిన విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోటంరెడ్డిను హత్య చేయాలనే చర్చతో కూడిన వీడియో ఒక న్యూస్ ఛానెల్‌లో బయటపడటంతో సంచలనం రేగింది. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేత. గతంలో వైఎస్సార్సీపీ నుంచి బయటికి వచ్చి టీడీపీలో చేరిన ఆయన.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటికే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సంఘర్షణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ హత్య కుట్రతో మరోసారి హెడ్‌లైన్స్ లో నిలిచారు.
కోటంరెడ్డి హత్య కుట్ర వీడియోను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేపట్టారు. కొంతమంది వ్యక్తులు కోటంరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుట్రలో స్థానిక స్థాయి నేతల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ కాల్ రికార్డులు, చాటింగ్ డేటా ఆధారంగా విచారణ సాగుతున్నట్టు సమాచారం. అయితే హత్య కుట్ర అంశంపై తాజాగా కోటంరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఒక ఛానెల్‌లో వీడియోను చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. జూలై 1న ఈ సంభాషణ జరిగినట్లు తెలిసిందని.. అందులో ఒకరు `రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు` అని, మరొకరు `చంపేద్దాం` అని చెప్పిన దృశ్యాలు ఉన్నాయని వివరించారు. ఈ కుట్ర విషయంపై మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీకి సమాచారం ఉన్నా, తాను ఎలాంటి హెచ్చరికలు పొందలేదని కోటంరెడ్డి ఆరోపించారు. కనీసం భద్రతా చర్యల గురించి చెప్పలేదన్న అంశాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ వ్యవహారంపై వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి మండిపడ్డారు. `రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను చంపుకునే చరిత్ర మాది కాదు. ఆస్తుల కోసం బంధువులను ద్వేషించే సంస్కృతి మన దగ్గర లేదు` అంటూ పరోక్షంగా వైసీపీకి కోటంరెడ్డి కౌంటనఖ వేశారు. అదేవిధంగా ఇటువంటి హత్యా కుట్రలకు బదిరిపోయే బ్లడ్ తనది కాదన్నారు. 16 నెలల ముందే జగన్‌ని ధిక్కరించానని.. తనను, తన కుటుంబ సభ్యులని బెదిరించినా భయపడలేదన్నారు. ఇటువంటివి ఎన్ని కుట్రలు చేసినా, వీడియోలు బయటపడ్డా ఐ డోంట్ కేర్ అని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తన కోసం నడిచే ప్రజల కోసం కొండలనైనా ఢీకొంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.