టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చారు. కుప్పంవాసుల దశాబ్దాల కలను చంద్రబాబు సాకారం చేశారు. కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు తెచ్చి కరువు నేలను సస్యశ్యామలం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 738 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పం నేలను కృష్ణమ్మ తాకింది. ఈ నేపథ్యంలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు స్వయంగా జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
పండితుల వేదమంత్రాల నడుమ కృష్ణమ్మకు పసుపు-కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంద్రీ-నీవా కాలువల విస్తరణ పనులు పూర్తయిన క్రమంలోని కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు తమ ప్రాంతానికి తెచ్చిన చంద్రబాబుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కృష్ణా జలాలతో కుప్పంలోని పరమ సముద్రం చెరువు నిండుకుండలా మారింది. దీంతో, స్థానికుల కోరిక ప్రకారం ఆ చెరువులో చంద్రబాబు బోటు ప్రయాణం చేశారు. బోటులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ హంద్రీనీవా జలాలతో కుప్పం నియోజకవర్గంలోని 66 చెరువులను నింపమన్నారు. సుమారు 3200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.