వైఎస్ జగన్ అసెంబ్లీకి గైర్హాజరైన విషయం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా, రాజకీయ రీత్యా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్న జగన్... అసెంబ్లీకి మాత్రం దూరంగా ఉండటం ఆయన నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రజల్లోనే కాదు సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ మొండిగా వ్యవహరిస్తున్నాడు.
నిజానికి హోదాతో పనిలేదు.. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నాయకుడే. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు వచ్చే ప్రోటోకాల్ లో ఎటువంటి మార్పులు ఉండవు. అసెంబ్లీలో జగన్ మాట్లాడేందుకు, తన వాదన వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఆ విషయాన్ని స్పీకర్ కూడా పలుమార్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటే తాము ప్రజల పక్షమే అని భావన వచ్చేలా వ్యవహరించాలి. కానీ, జగన్ మాత్రం అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల కోసం పోరాడుతాను అంటున్నారు. ఇదే వైసీపీకి పెద్ద మైనస్ అవుతోంది.
వర్షాకాల సమావేశాలకు అయినా జగన్ హాజరవుతారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు అది కూడా డౌటే. అధికార పార్టీకి ధీటుగా జగన్ భారీ కాన్వాయ్‌లతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక మీడియా సమావేశాలు, ప్రభుత్వంపై విమర్శలు, ప్రజలలోకి వెళ్లే కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నా, అసెంబ్లీ వేదికగా అధికార పార్టీకి నిలదీసే ప్రయత్నం మాత్రం కనిపించడంలేదు.
ప్రెస్ మీటింగ్స్ వద్దు అసెంబ్లీకి రండి అంటూ చంద్రబాబు స్వయంగా సవాల్ విసరారు. ఇది నిజంగా వైసీపీకి గొప్ప అవకాశం. కానీ ఇప్పటికీ జగన్ తీరు మారలేదు. రాని హోదా కోసం పాకులాడుతున్నారు. పైగా దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి.. మీపై పోరాటం చేస్తానంటున్నారు. అంటే అధికార పార్టీపై పోరాడేందుకు ఆ పార్టీనే అనుమతి కోరుతున్నారు. ఈ చర్యతో ఇదేం విడ్డూరం రా బాబు అంటూ సొంత పార్టీ నేతలే తలదించుకోవాల్సిన పరిస్థితి.
ప్రజల కోసం పోరాటం చెయ్యాలంటే, హోదా అవసరం లేదు. పోరాటానికి వేదిక కావాల్సింది అసెంబ్లీ. ఇదే విషయాన్ని అనేక విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. తీరుని మార్చుకోకపోతే జగన్ స్టాండ్ వైసీపీకి బరువు అవుతుంది. వైఎస్ జగన్ తెలివైన రాజకీయ నాయకుడు. ప్రజల నాడిని చదివే అనుభవం ఉంది. కానీ ప్రస్తుతం తీసుకుంటున్న ఈ `హోదా ఉన్నప్పుడే పోరాటం` అనే శైలిని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలోకి వెళ్లకపోతే, ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అధికారిక వేదికను కోల్పోవడమే కాదు.. ప్రజల్లో పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.