తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని పార్టీ ఆఫీసులో కూర్చుని చెప్పినా కేటీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. 104 రోజులపాటు తనతో మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెలు సంబంధం పక్కన పెడితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్...భీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన తన సమస్యను విని పరిష్కరించాల్సింది పోయి తనతో మాట్లాడటం ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై కుట్రలు జరుగుతున్నా సరే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కవిత సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో చేశానని, అలాంటిది తనను హఠాత్తుగా పార్టీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ లకు జరగవచ్చని, పార్టీని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ బిడ్డ అయిన తనకే న్యాయం జరగలేదని, పార్టీలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు.
ప్రెస్ మీట్ పెట్టి మరి పార్టీలోని సమస్యలపై తాను గళం విప్పినా కేటీఆర్ స్పందించలేదని ఆరోపించారు. కేసీఆర్ పై సిబీఐ కేసు నమోదైందని, అటువంటి సమయంలో పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వక్రీకరించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.