 
    బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత తాజాగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆమె ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను దెబ్బతీసి పార్టీని చేజిక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. 24 ఏళ్ల గ్యాప్‌లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సీన్ సేమ్ టు సేమ్ రిపీట్ అయింది. తెలంగాణ రాజకీయ చరిత్రలో 2001 ఏప్రిల్ 27 ఒక మలుపు తిప్పిన రోజు. అప్పట్లో కేసీఆర్ టీడీపీని వీడి, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్) ను స్థాపించారు. అదే పార్టీ తర్వాత దశల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే శక్తిగా మారింది. ఇప్పుడు, 2025లో కవిత కూడా అదే తరహా నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
నాడు కేసీఆర్ మూడు రాజీనామాలు (డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, పార్టీ సభ్యత్వం) చేసి పెద్ద సాహసం చేశారు. ఆ తర్వాత వెంటనే సిద్దిపేట ఉప ఎన్నికల్లో గెలిచి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి బలమైన మద్దతు తెచ్చుకున్నారు. ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. నేడు బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న కవిత, వెంటనే ఎమ్మెల్సీ పదవి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నారు అనే వార్తలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ బరిలో నిలబడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది
నేడు మీడియా సమావేశంలో `ఉద్యమం నుంచి వచ్చిన నేను మళ్లీ ఉద్యమంలోకే వెళ్తాను` అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ 2001లో చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నాయి. కేసీఆర్ అప్పట్లో `పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం` అన్న నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇప్పుడు కవిత కూడా `పదవి కంటే ఉద్యమమే ముఖ్యం` అనే భావనను ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయమే టీఆర్ఎస్ పునాదికి బలంగా నిలిచింది. అదే సెంటిమెంట్‌ను కవిత ఇప్పుడు మళ్లీ రిపీట్ చేయాలనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే 24 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిన నిర్ణయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసింది. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ, కవితకు మార్గం అంత తేలిక కాదు. బీఆర్‌ఎస్ నుంచి వేరుపడి, కొత్త పార్టీని నిలబెట్టడం, ప్రజలలో విశ్వసనీయత సాధించడం, కేసీఆర్ మాదిరి ఉద్యమాత్మక వాతావరణం మళ్లీ సృష్టించడం.. ఇవే కవిత ఎదుట ఉన్న పెద్ద సవాళ్లు. మరి ఇకపై కవిత వేయబోయే అడుగులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువవంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.