మేకర్స్ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా రామాయణమే కావచ్చు. కానీ అత్యధిక అంచనాలున్న సినిమా ఏదంటే మాత్రం రాజమౌళి-మహేష్ బాబు సినిమానే అనడంలో సందేహం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు సంపాదించిన రాజమౌళి నుంచి రాబోయే తర్వాతి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
 
తన గత సినిమాల్లా ఆరంభ దశలో ఏ విశేషాలు పంచుకోకుండా సైలెంట్‌గా షూటింగ్ చేసుకుపోతున్నాడు జక్కన్న. నవంబరులో ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్న విషయాన్ని మాత్రం వెల్లడించారు. కొన్ని నెలలుగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఎక్కువగా కెన్యా దేశంలోనే షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ దౌత్య అధికారులతో కలిసి రాజమౌళి, నిర్మాత కె.ఎల్.నారాయన; ఎస్.ఎస్.కార్తికేయ తదితరులు షూటింగ్ గ్యాప్‌లో కెన్యా ఫారిన్ ఎఫైర్స్ క్యాబినెట్ సెక్రటరీ ముసాలియా ముడవాడితో పాటు ఇతర మంత్రులతో భేటీ అయ్యారు.
 
ఈ సమావేశం గురించి కెన్యా క్యాబినెట్ సెక్రటరీ స్వయంగా ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. ఆయన రాజమౌళి అండ్ టీం మీద ప్రశంసల జల్లు కురిపించాడు. దర్శకుడిగా రాజమౌళి గొప్పదనాన్ని కొనియాడాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆఫ్రికా అడవుల్లో, ముఖ్యంగా కెన్యాలో అత్యధిక భాగం చిత్రీకరణ జరుపుకోవడం తమకు గర్వకారణమని అన్నారు. తమ దేశంలోని అందాలను యావత్ ప్రపంచానికి చూపెట్టేందుకు రాజమౌళి అండ్ టీమ్ చేసిన ప్రయత్నానికి అభినందనలు తెలుపుతున్నామన్న ఆయన... ఈ ప్రెస్టీజియస్ మూవీని 120కి పైగా దేశాలలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
 
బహుశా రాజమౌళి చెప్పిన మాటనే ముసాలియా ఈ పోస్టులో పేర్కొన్నట్లుగా భావిస్తున్నారు. 120 దేశాల్లో రిలీజ్ అంటే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లే. ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్ జనాలను మెస్మరైజ్ చేసిన జక్కన్న.. ఈ చిత్రంతో మొత్తం ప్రపంచాన్నే ఊపేసేలా ఉన్నాడు.