 
    2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి తరఫున టీడీపీ నేత వంగవీటి రాధా ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. అయితే, కూటమిలోని వివిధ పార్టీలు, సమీకరణాల నేపథ్యంలో రాధాకు ఆ పదవి మాత్రమే కాదు ఎటువంటి నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదు. దీంతో, రాధా అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్ నుండి రాధాకు పిలుపు వచ్చింది. దాదాపు 11 నెలల విరామం తర్వాత లోకేశ్ తో రాధా భేటీ కాబోతుండడంతో ఆ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ భేటీ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు రాధా రానున్నారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు గురించి లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ ఈ భేటీ తర్వాత వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. రాధాకు ఏ పదవి ఇవ్వబోతున్నారన్న విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ రాధా టీడీపీ తరఫున, కూటమి పార్టీల అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేశారు. వైసీపీపై, జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.