తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ తనయ కవిత.. నేడు తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పిల్లర్స్ అయిన హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా లొంగిపోయారని ఆమె ఆరోపించారు. రేవంత్, హరీశ్ ఇద్దరూ ఢిల్లీకి ఒకే ఫ్లైట్‌లో వెళ్లారని, ఆ ప్రయాణంలో హరీష్ రేవంత్ కాళ్లపై పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రయాణం తర్వాత హరీశ్ పూర్తిగా మారిపోయారని, రేవంత్ ప్రభావానికి లోనై కుట్రల పంథాలో నడుస్తున్నారని కవిత మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లను బలహీనపరిచి, పార్టీని చేజిక్కించుకునే కుట్రలు సాగుతున్నాయని.. హరీష్ రావు, సంతోష్ రావుల రేవంత్ వెనకుండి నడిపిస్తున్నారని కవిత ఆరోపించారు.
అయితే కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు తిరస్కరించిన వారి వెనుక నేనెందుకు ఉంటా? నాకంత సమయం లేదమ్మా. మీ కుటుంబ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దంటూ సీఎం స్పష్టం చేశాను. తానొక నాయకుడ్ని.. అందరికీ ముందుంటానే తప్ప వెనకుండనని కౌంటర్ ఎటాక్ చేశారు. బీఆర్ఎస్ ఒక కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అన్నారు. విపరీతంగా అవినీతి సొమ్ము సంపాదించారు.. అందుకే కల్వకుంట్ల కుటుంబంలో వాటాల విషయంలో కుమ్ములాటలు జరుగుతున్నాయని.. వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంతోమందిని రాజకీయంగా అణచివేసి, అక్రమంగా జైళ్లకు పంపినవాళ్లే ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కొట్టుకుంటున్నారని అన్నారు. పాపం ఊరికే పోదు.. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ రేవంత్ విమర్శించారు.