ఇప్పుడు తెలుగులో ఏదైనా ఒక భారీ చిత్రం మొదలైతే.. దాన్ని రెండు భాగాలుగా తీయడం లేదంటే ఆ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన రావడం సాధారణం అయిపోయింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచే ఈ ట్రెండు ఊపందుకుంది. రాజమౌళి తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది కానీ.. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.
ఇక మహేష్ బాబుతో జక్కన్న మొదలుపెట్టిన కొత్త చిత్రం కూడా రెండు భాగాలుగా ఉండొచ్చని గతంలో ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఇది ఒక్క సినిమానే అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కథ మారింది. మహేష్ చిత్రాన్ని రెండు భాగాలుగానే తీయాలని రాజమౌళి యోచిస్తున్నాడట. ఈ విషయాన్ని కెన్యా మీడియా వెల్లడించడం విశేషం.
మహేష్-రాజమౌళి సినిమా కెన్యాలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కెన్యా ఫారిన్ అఫైర్స్ క్యాబినెట్ సెక్రటరీని కూడా కలిశాడు రాజమౌళి. దీని గురించి కెన్యాలో టాప్ న్యూస్ పేపర్ అయిన ‘ది స్టార్’లో ఒక కథనం ప్రచురితమైంది. అందులో ఈ సినిమా షూటింగ్, ఇతర విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుందని.. రెండు భాగాలకు కలిపి రూ.1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని.. మేజర్ పార్ట్ షూట్ కెన్యా అడవుల్లోనే జరుగుతుందని పేర్కొన్నారు.
చిత్ర బృందం ఇచ్చిన సమాచారం మేరకే ఈ న్యూస్ పబ్లిష్ అయి ఉండొచ్చు. ఈ సినిమా 120 దేశాల్లో రిలీజవుతుందనే సమాచారాన్ని కూడా కెన్యా ఫారిన్ అఫైర్స్ క్యాబినెట్ సెక్రటరీనే వెల్లడించడం గమనార్హం. మొత్తానికి జక్కన్న ఈ సినిమా గురించి ఇప్పటిదాకా మన మీడియాతో ఏ విశేషం పంచుకోకున్నా.. కెన్యా నుంచి ముఖ్యమైన సమాచారం బయటికి వచ్చేస్తోంది.