దేశంలోని అతి పురాతన పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలకు, గ్రూపు రాజకీయాలకు కూడా పెట్టింది పేరు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రాంతాల్లో కోల్డ్ వార్ నడుస్తుంటుంది. ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో అయితే అంతర్గత కుమ్ములాటలకు కొదవే లేదు. సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో వీహెచ్ వంటి సీనియర్ నేతలు పెదవి విరిచారు. ఇక, తాజాగా మరోసారి కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని సురేఖకు వార్నింగ్ ఇచ్చారు.
తన నియోజకవర్గ పరిధిలోని విషయాల్లో కొండా సురేఖ జోక్యం చేసుకోవడంపై రాజేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన మంత్రి సురేఖ అనవసరంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని హితవు పలికారు. సుప్రసిద్ధ భద్రకాళి ఆలయ కమిటీ సభ్యుల నియామకంలో మంత్రి సురేఖ తనకు నచ్చిన వారికి పదవులు ఇప్పించడం సముచితం కాదని అన్నారు. సురేఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖ జోక్యం గురించి పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.