మిగిలిన రాష్ట్రాల రాజకీయాలకు తెలుగు రాజకీయాలకు గతంలో చాలా తేడా ఉండేది. రాజకీయ విభేదాలు రాజకీయాలు.. పార్టీల వరకు ఉంచేసి.. వ్యక్తిగతంగా ఒక చక్కటి బంధం ఉండేది. రాజకీయాల పరంగా తేడాలొస్తే.. ఆ విరోదం అక్కడి వరకే ఉండేది. కొన్ని సందర్భాల్లోనే అవి వ్యక్తిగతస్థాయిల్లోకి వెళ్లేవి. విధానాల పరంగా భిన్న ధోరణులున్నప్పటికి.. ఆ ఇద్దరు నేతలు ఎదురుపడితే కుశలప్రశ్నలు కనిపించేవి.
గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్లో వచ్చిన మార్పుల పుణ్యమా అని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీల మధ్య విభేదాలు.. వ్యక్తిగత స్థాయిల్లోకి వెళ్లటమే కాదు.. రాజకీయ వైరం భారీగా ముదిరిపోయింది. అదెంతవరకు వెళ్లిందంటే.. వైరి వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఎదురుపడితే ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితులు కూడా లేని దుస్థితి. తెలుగు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఇది మరింత ఎక్కువైంది.
గతంలోనూ రాజకీయ వైరం ఉన్నా.. పవర్ కోసం చేసే రాజకీయాలకు సంబంధించిన ఒక సన్నటి గీత రాజకీయ నేతల మధ్య సంబంధాల్ని బాగుండేలా చేసేది. అదికాస్తా చెరిగిపోవటం.. అధికారం.. పదవులు మాత్రమే తప్పించి..మరింకేమీ ముఖ్యం కాదన్న వ్యవహారశైలి రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది.
ఇలాంటి సందర్భంలో ఉప్పు.. నిప్పులా ఉండే పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కలిసినప్పుడు.. వారి మధ్య గౌరవమర్యాదలు.. అభిమానం లాంటి సన్నివేశాలు చోటు చేసుకోవటం అరుదుగా మారింది. అలాంటిదే ఒక సీన్ విజయవాడ వేదికగా ఆవిష్క్రతమైంది. విశాఖ ఉక్కుపై బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనటానికి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అక్కడకు రాగా.. అప్పటికే వచ్చి కూర్చున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆమెను చూసి గౌరవ సూచకంగా లేచి నిలబడుతూ.. ‘రా అమ్మా.. ఇక్కడ కూర్చో’ అంటూ తన పక్కనున్న కుర్చీని చూపించటం.. అందుకు తగ్గట్లే షర్మిల ఆ కుర్చీలో కూర్చోవటం జరిగింది.
ఈ సందర్భంగా షర్మిలతో.. బొత్స.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణలు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వెళ్లిపోయే వేళలో.. ‘అన్నా వెళ్లొస్తా’ అంటూ బొత్సకు నమస్కారం పెట్టి షర్మిల వెళ్లిన వైనం పలువురిని ఆకర్షించింది. పార్టీల పరంగా చూసినా.. వ్యక్తిగతంగా చూసినా కూడా ఎడముఖం.. పెడ ముఖం అన్నట్లుగా ఉండాల్సిన వేళ.. అందుకు భిన్నంగా పెద్ద మనిషి తరహాలో బొత్స వ్యవహరించటం.. అందుకు తగ్గట్లే.. షర్మిల కూడా స్పందించిన వైనం అందరిని ఆకర్షించింది.
రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టి.. ఈ తరహాలో వ్యవహరించటం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సీన్లు మరిన్ని చోటు చేసుకోవాలని ఆశిద్దాం.