టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మనవడు....మంత్రి నారా లోకేశ్ తనయుడు..నారా దేవాన్ష్ చెస్‌లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పట్టుమని పదేళ్లు కూడా లేని దేవాన్ష్ ప్రపంచస్థాయి ఛెస్ లో రాణిస్తూ తాత, తండ్రి పేరు నిలబెడుతున్నాడు. ఛెస్ లో 175 కష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా నిలిచాడు.
ఈ క్రమంలోనే లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో దేవాన్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే తాజాగా దేవాన్ష్ ఆ అవార్డును లండన్ లో శనివారం నాడు అందుకున్నాడు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. ఇంత చిన్న వయసులోనే దేవాన్ష్ ఈ ఘనత సాధించినందుకు గర్వంగా ఉందని చెప్పారు.
దేవాన్ష్ ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణం అని లోకేశ్ చెప్పారు. దేవాన్ష్ అకుంటిత దీక్షతో ఒత్తిడిని జయించి స్థిత ప్రజ్నతతో శిక్షణ పొందాడని అన్నారు. ఎన్నో గంటల పాటు దేవాన్ష్ ప్రాక్టీస్ చేసేవాడని, అందుకు తానే సాక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శనల నుంచి దేవాన్ష్ స్ఫూర్తి పొందాడని అన్నారు. దేవాన్ష్‌కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి, కోచ్ రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక, ఈ రికార్డుతోపాటు దేవాన్ష్ చెస్‌లో మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా గతంలో సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తి చేసి ఔరా అనిపించాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పదేళ్ల వయసులోనే దేవాన్ష్ సాధిస్తున్న ఈ విజయాలు చూస్తుంటే అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ఛెస్ లో మరింత పేరు తేవడం ఖాయం.