సీఎం చంద్రబాబు, వైసీపీ నేత సజ్జల..ఈ ఇద్దరు నేతల స్థాయి ఒకటేనా? సీఎం పీఆర్వో వ్యవస్థ పనితీరు సమీక్షించాల్సిన అవసరముందా? చంద్రబాబు కార్యక్రమాలపై టీడీపీ సోషల్ మీడియా విభాగం వంద శాతం ఫోకస్ చేయడం లేదా? సగటు టీడీపీ కార్యకర్తను, అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. ప్రస్తుతం వీటిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇటీవల వే టు న్యూస్ నిర్వహించిన ‘వే 2న్యూస్ కాన్ క్లేవ్-2025 మీట్’ వల్ల ఉత్పన్నమైన ఈ ప్రశ్నలు కొత్త చర్చకు దారి తీశాయి.
ఇటీవల జరిగిన ‘వే 2న్యూస్ కాన్ క్లేవ్-2025 మీట్’కు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇదే కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను పిలిచి ఉంటే బాగుండేది. కానీ, గత ప్రభుత్వంలో సకల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జలను పిలిచారు నిర్వాహకులు. ఓ పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క కనీసం వార్డు మెంబర్ కూడా గెలవని సజ్జల. ఏ రకంగా చూసినా ఈ ఇద్దరు నేతల స్థాయి సరితూగలేదు. దీంతో, చంద్రబాబు పరపతి తగ్గిందా ? సజ్జల పరపతి పెరిగిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ఈ తరహా కార్యక్రమాలు ప్లాన్ చేసే ముందు ముఖ్యమంత్రి పీఆర్వో వ్యవస్థ ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కదా అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. జగన్ ఆ కార్యక్రమానికి రాను అని చెప్పి ఉంటే...ఆ విషయం నిర్వాహకులు ప్రకటించి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. రాజధాని అమరావతి గురించి సజ్జలను ప్రశ్నించడం ఒక తప్పయితే...ఈ సారి తాము అధికారంలో వస్తే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని పెడతామంటూ సజ్జల అడ్డదిడ్డంగా సమాధానమివ్వడం బ్లండర్.
ముఖ్యమంత్రి కార్యక్రమాలపై అత్యంత శ్రద్ధ వహించాల్సిన పీఆర్వో వ్యవస్థ ఇంతటి అలసత్వంతో పని చెయ్యడం వల్ల చంద్రబాబు పట్ల నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముంది. ఇక, టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఈ కార్యక్రమంపై గట్టిగా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. కాలానుగుణంగా పార్టీ విధానాలు కూడా మార్చుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ వంటివి అమలు చేసే విషయంలో పార్టీ విధానాలు మారడం హర్షణీయం.
అదే రీతిలో పార్టీ అంతర్గత విధానాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా, ఇటువంటివి పునరావృతం కాకుండా ఇటు పార్టీ అధిష్టానం, అటు సోషల్ మీడియా విభాగం, సీఎం పీఆర్వో దీని మీద దృష్టి సారించాల్సిన అవసరముంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా ఈ విషయాలపై ఫోకస్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయలు పలువురు తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.