వైసీపీలో నెంబర్ 2 లీడర్‌గా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ ముగింపు దశలోకి వెళ్తుందా? జగన్ ఆయనకు చెక్ పెట్టారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇక ఎవరూ పట్టించుకోవద్దని వైసీపీ శ్రేణులకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతిపై సజ్జల తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సజ్జలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి లభించింది. ఆ తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల తన పట్టును పెంచుకున్నారు. మూడు రాజధానుల సిద్ధాంతం నుంచి అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొనే వ్యూహాల దాకా.. ప్రతి అంశంలోనూ ఆయనే ముఖ్య బ్రెయిన్ అన్న మాట వినిపించింది. కానీ, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం అందరి వేళ్లు సజ్జల వైపే చూపాయి. ఆయన తప్పుడు సలహాల వల్లే పార్టీ డౌన్ అయిందన్న ఆరోపణలు సీనియర్ నేతలు, కేడర్ నుంచి కూడా బలంగా వినిపించాయి.
అయినప్పటికీ జగన్ ఆయనపై నమ్మకం వదలకుండా కొనసాగించారు. అయితే ఈసారి సజ్జల చేసిన అమరావతి వ్యాఖ్యలు పార్టీతో పాటు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లు అయింది. మూడురాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థించడంలో అగ్రగామిగా ఉన్న సజ్జల.. అకస్మాత్తుగా రెండు రోజుల క్రితం మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఊహించని కామెంట్స్ చేశారు. అమరావతిపై జగన్ అనుకూలంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే అమరావతి నుంచి పాలన సాగిస్తారని వ్యాఖ్యానించారు. పైగా జగన్ రెడ్డికి ఏమీ తెలియదు.. తాను ఏం చెబితే ఆయన అది చేస్తాడు అన్న చందంగా సజ్జల మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు జగన్ కు ఆగ్రహం తెప్పించాయి. అమరావతిపై సజ్జల మాటల్ని ఎక్కడా తన మీడియా, సోషల్ మీడియాలో రాకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలో ఇకపై ఎవరూ పట్టించుకోవద్దని కూడా జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు సాక్షి మీడియా, వైసీపీకి చెందిన ప్లాట్‌ఫార్మ్స్‌లో సజ్జల ప్రొజెక్షన్ లేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అమరావతిపై సజ్జల అత్యంత కీలకమైన ప్రకటన చేస్తే సాక్షి పత్రిక ఆ ఊసే ఎత్తలేదు. ఈ పరిణామాలతో మరి కొన్ని నెలల్లో వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ క్లోజ్ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు వైసీపీలో స్ట్రాటజిక్ మైండ్ గా పేరుపొందిన సజ్జల ఇప్పుడు ఐసోలేషన్ దశలోకి వెళ్ళిపోతున్నారు.