ఏపీలోని జిల్లా కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. తొలి రోజు సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసుల్లో పేపర్లపై అంతా సవ్యంగానే కనిపిస్తుందని, కానీ, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలని, అప్పుడే ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని అన్నారు.
ప్రభుత్వ పాలనలో ప్రధాని, ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని అన్నారు. ఎమ్మెల్యేల ఎంపిక, మంత్రివర్గ కూర్పులో నిశిత పరిశీలన చేసిన మాదిరిగానే సమర్థులైన వారిని కలెక్టర్లుగా నియమించామని చెప్పారు. అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అయితే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడనని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందన్నారు.
వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమయిందని, వారసత్వ ఆస్తులను సైతం కబ్జా చేసే దుస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని చెప్పారు. అందుకే, భూ వివాదాలకు ఆస్కారం లేకుండా, రిజిస్ట్రేషన్ పత్రాలను ట్యాంపర్ చేయకుండా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.