ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం 16347 పోస్టులతో భారీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చిన 150 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసింది. టీడీపీ అంటేనే డీఎస్సీ అని మరోసారి నిరూపించింది. తాజాగా నేడు మెగా డీఎస్సీ-2025 తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రికార్డు స్థాయిలో కేవలం 150 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తిచేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని లోకేశ్ చెప్పారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. పారదర్శకంగా నియామక ప్రక్రియను ముగించామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తికి ఇది ఆరంభం అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు లోకేశ్ పిలుపునిచ్చారు. ఇక, ఈ సారి ఛాన్స్ రాని అభ్యర్థులు నిరుత్సాహం చెందవద్దని, ఇచ్చిన హామీ ప్రకారం, ఇకపై ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని అన్నారు. పట్టుదలతో సాధన కొనసాగించాలని, అవకాశం తప్పకుండా వస్తుందని భరోసానిచ్చారు.