సాధారణ టీ అమ్మే కుటుంబం నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రయాణం భారతీయ రాజకీయాల్లో ఒక ప్రేరణాత్మక గాథ. ఆయన నిర్ణయాలు, ఆత్మవిశ్వాసం, బలమైన నాయకత్వం దేశ రాజకీయాలను కొత్త దిశగా నడిపించాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను పెంచడంలోనూ విశేష పాత్ర పోషించిన నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు నేడు. అయితే మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
అదే ప్రధాని మోదీకి అందిన బహుమతుల ఈ-వేలం. మోదీకి దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచి కూడా అభిమానులు, ప్రజలు, కళాకారులు, క్రీడాకారులు, భక్తులు బహుమతులు పంపుతుంటారు. అయితే ఈ గిఫ్ట్‌లను 2019 నుంచి వేలం వేస్తున్నారు. ఈసారి కూడా వేలం కార్యక్రమం ప్రారంభమైంది. 2025లో మోదీ 75వ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన 7వ ఎడిషన్ ఈ-వేలం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతోంది. అధికారిక వెబ్‌సైట్ pmmementos.gov.in ద్వారా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈసారి ఏకంగా 1,300కి పైగా విలువైన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. వేలం ప్రారంభానికి ముందు ఈ ప్రత్యేక బహుమతులను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA)లో ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.
వేలంలో ఉండే ముఖ్యమైన వస్తువులు:
భవానీ దేవి విగ్రహం అత్యంత ఆకర్షణీయమైన వస్తువుల్లో ఒకటి. దీని బేస్ ధర రూ. 1.03 కోట్లు. భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచే అయోధ్య రామ మందిరం మోడల్ రూ. 5.5 లక్షలకు లిస్టులో ఉంది. భారత పారా-అథ్లీట్లు ధరించిన మూడు జతల షూస్ ఈ-వేలంలో హైలైట్. ఒక్కో జత ధర రూ. 7.7 లక్షలు. అలాగే జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేకమైన హస్తకళా సంపద పశ్మినా శాలువా, రామ దర్బార్ చిత్రణతో ఆకట్టుకునే శిల్పకళ తంజోర్ పెయింటింగ్, నటరాజ విగ్రహం, రోగన్ ఆర్ట్‌వర్క్, నాగా శాలువా.. ఇలా ఎన్నో విలువైన బహుబతులు వేలంలో ఉన్నాయి.
పారిస్ పారాలింపిక్స్‌లో గెలిచిన పతకాలు, ఆటగాళ్లు ధరించిన షూస్ వంటి వస్తువులు వేలంలో ఉంచడం ద్వారా క్రీడా రంగం వైభవాన్ని స్మరింపజేస్తోంది. మరోవైపు భారతీయ సాంప్రదాయ కళలతో కూడిన వస్తువులు కూడా అందులో చోటు చేసుకోవడం ఈ వేలాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఇక గత సంవత్సరాల మాదిరిగానే, ఈ-వేలం నుండి వచ్చే మొత్తం ఆదాయమంతా గంగా నది మరియు దాని పర్యావరణ వ్యవస్థ యొక్క పునరుజ్జీవనం, పరిరక్షణ మరియు రక్షణ కోసం భారత ప్రభుత్వం యొక్క ప్రధాన చొరవ అయిన `నమామి గంగే` ప్రాజెక్టుకు వెళ్తుంది. కాగా, ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో ఈ ఈ-వేలం ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మోదీకి అందిన బహుమతులను వేలంలో ఉంచి, ఆ మొత్తాన్ని జాతీయ ప్రాజెక్టులకు వినియోగించడం ప్రజల భాగస్వామ్యాన్ని మరింత అర్థవంతం చేస్తోంది.