వైసిపి హయంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పెద్ద ఎత్తున దుమారం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 17 కాలేజీలలో ఐదు కాలేజీలను వదిలిపెట్టి మిగిలిన పది కాలేజీలను పిపిపి విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా కాలేజీలు అందుబాటులోకి వస్తాయని సర్కారు చెబుతోంది. అయితే ఇలా పిపిపి విధానాన్ని ఎంచుకుంటే పేదలకు, అదేవిధంగా వైద్య విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందని వైసిపి నాయకులు చెబుతున్నారు.
ముఖ్యంగా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ అయితే దీనిపై ఒక గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు వివరించారు. తాము ఎక్కడెక్కడ ఏఏ కాలేజీలు ఏర్పాటు చేశాము.. ఏ ఏ కాలేజీలు వస్తే ఎంతమంది ప్రజలకు లబ్ధి జరుగుతుంది.. ఎంత మేరకు పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే విషయాలను ఆయన వివరించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలోనూ అదే విధంగా యూట్యూబ్ ఛానల్ లోనూ చర్చ జరుగుతోంది. ప్రభుత్వం చేస్తోంది తప్పు అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వైద్యం ఖరీదు అయిపోయిందని, రేపు ప్రభుత్వం పరిధిలో ఉండాల్సిన కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తే మరింతగా పేదలకు అన్యాయం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటివ రకు ఎదురుదాడి చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఒక అడుగు వెనక్కు వేసినట్టు తెలుస్తోంది. పిపిపి విధానం పై ప్రజలనుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆన్లైన్ సర్వేలు అదే విధంగా ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని వివరించి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని భావిస్తున్నారు.
మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గితే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను మంజూరు చేయాలి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం పై ఆరువేల కోట్ల వరకు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే వాటిని పిపిపి విధానంలో నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. కానీ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగడం, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారడంతో ఈ విధానంపై ఇప్పుడు సర్వే చేయించి వచ్చిన ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే మార్కాపురం సహా 5 కాలేజీలకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో దానిని ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.