రాజధాని అమరావతి నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం అక్కసుతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జగన్ నియంత పాలన కొనసాగిస్తూ అమరావతిపై కక్షగట్టడంతో పలు ప్రభుత్వ భవనాలతో పాటు మౌలిక సదుపాయాలైన వంతెనల నిర్మాణాలు కూడా ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా అమరావతికే తలమానికమైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా జగన్ అటకెక్కించారు. అయితే, సీఎం చంద్రబాబు 2024లో పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నమూనాకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. దాదాపు 2,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఆ వంతెన నమూనాను చంద్రబాబు ఖరారు చేశారు. వంతెన నిర్మాణం మోడల్ కు సంబంధించి నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ఓటింగ్ నిర్వహించారు. అందులో ఎక్కువ ఓట్లు పొందిన రెండో నమూనాకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.
కూచిపూడి నృత్య కళను ప్రతిబింబించే ‘స్వస్తిక హస్త’ ఆకృతిని పోలి ఉండేలా ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో ఈ ఐకానిక్ కేబుట్ బ్రిడ్జి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. శిల్పకళ, సాంకేతికత, సంస్కృతిల సమ్మేళనంగా నిలిచే ఈ వంతెన రాష్ట్రానికి తలమానికంగా మారనుంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ ను నిప్పన్ కోయి లిమిటెడ్ సంస్థ సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా ఈ వంతెనను 6 లైన్లుగా నిర్మిస్తారు.
అమరావతిలోని రాయపూడి నుండి కృష్ణా నదికి అవతల విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి 65 వద్ద ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు 5.22 కి.మీ పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ప్రస్తుతం మూలపాడు నుంచి అమరావతికి ప్రయాణ దూరం 40 కిలోమీటర్లుగా ఉంది. ఈ బ్రిడ్జి పూర్తయితే ఆ దూరం 5 కి.మీ మాత్రమే ఉంటుంది. 2019లో పవిత్ర సంగమం వద్ద ఈ వంతెన నిర్మాణానికి రూ.1,387 కోట్లతో అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. ప్రస్తుతం స్థలం మార్పు చేసి ఈ ప్రాజెక్టును మళ్లీ టీడీపీ ప్రభుత్వం పునఃప్రారంభించింది.