2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అహర్నిశలు పాటుబడుతున్న సంగతి తెలిసిందే. దావోస్ మొదలు తాజాగా లండన్ పర్యటన వరకు రాష్ట్రానికి పరిశ్రమలను, ఐటీ కంపెనీలకు ఆహ్వానించేందుకు లోకేశ్ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్ లో పారిశ్రామికవేత్తలతో ఉన్నతస్థాయి రోడ్ షో నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న "పార్టనర్‌షిప్ సమ్మిట్-2025"కు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించడమే ఈ రోడ్ షో ఉద్దేశ్యం.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని లండన్‌లోని ఇస్కాన్ టెంపుల్ లో లోకేశ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. మోదీ దార్శనిక నాయకత్వం మరిన్ని ఏళ్లు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థించానని లోకేశ్ చెప్పారు. మోదీ తలపెట్టిన 'వికసిత భారత్' లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన నాయకత్వం ఎంతో కీలకమని లోకేశ్ అన్నారు.
లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:30 గంటలకు లోకేశ్ రోడ్ షో ప్రారంభమవుతుంది. యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం అధ్యక్షుడు హర్షూల్ అస్నానీ, ఐసీఐసీఐ బ్యాంకు యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిక్త్ కిశోర్ వంటి ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.రోడ్ షోలో భాగంగా ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను లోకేశ్ ఇస్తారు.