ఒక పార్టీని అధికార పక్షంలో కూర్చోబెట్టడం..మరొక పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడం ప్రజల చేతిలో ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలు...ఈ సారి ఘోర పరాభవం మిగిల్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ పార్టీ అయినా శిరసావహించక తప్పదు. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రతిపక్ష హోదా కావాల్సిందే అంటూ వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీ నేతలంతా చిన్నపిల్లల మాదిరి మంకుపట్టు పడుతున్నారు.
ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అసెంబ్లీకి రామంటూ చిన్న పిల్లలు మారం చేసిన మాదిరిగా మారం చేస్తున్నారు. జగన్ సోదరి షర్మిల మొదలు సీఎం చంద్రబాబు వరకు ఎంత మంది విమర్శించినా సరే జగన్ అండ్ కో తీరులో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలపై ఉందని హితవు పలికారు.
అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు బయట తిరగడం సరికాదని ఆయన అన్నారు. అయ్యన్నపాత్రుడికి గౌరవం ఇవ్వాల్సిన పనిలేదని, కానీ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యత అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి రావాలని కోరారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి శాసనసభ సమావేశాలు మంచి వేదిక అని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు రెండు కొమ్ములుఃన్నాయా అని ఆయన నిలదీశారు. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకుంటే జీతం కట్ చేస్తామని, పనిష్మెంట్ ఇస్తామని, అప్పటికీ మాట వినకుంటే సస్పెండ్ చేస్తామని అన్నారు. అదే మాదిరిగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.