అదేమిటో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్నిసార్లు చెప్పే మాటల్ని చూసినప్పుడు విస్మయానికి గురి కాక తప్పదు. పార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని ఉద్దేశించి గంభీరమైన ప్రకటనలు చేస్తారు. తీరా చూస్తే.. ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో అందుకు విరుద్ధమైన పనులు జరుగుతూ ఉండటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా పనులు చేయొద్దని తేల్చి చెప్పారు. ‘వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లే. వాల్లకు పనులు చేసినట్లు తెలిస్తే సహించేది లేదు. పార్టీ విజయం కోసం రక్తం చిందించిన కేడరర్ గురించి ఈ తొమ్మిది నెలల్లో ఆలోచించలేకపోయాం. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా’ అంటూ ప్రజావేదిక కార్యక్రమం ముగిసిన తర్వాత నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడారు.
తరచూ కేడర్ తో మమేకం అవుతానని చెప్పిన చంద్రబాబు ‘‘మిమ్మల్ని కలవటం నా బాధ్యత. పార్టీ కోసం ఎవరు కష్టపడి పని చేస్తున్నారు? ఎవరు కబుర్లు చెబుతూ తిరుగుతున్నారో గుర్తించేందుకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. 2024 ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో బీసీలు.. మహిళలు.. యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. ఇకపై అది కంటిన్యూ అవుతుంది’’ అని పేర్కొన్నారు. చంద్రబాబు నోటి నుంచి ఈ మాటలు విన్న పార్టీ నేతలు.. కార్యకర్తలు కొందరు ఆశ్చర్యపోతున్నారు.