ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ నేతలంతా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. జగన్ కు పీపీపీ అంటే తెలియదని మంత్రి లోకేష్ కూడా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి సెటైర్లు వేశారు.
జగన్ కు జనరల్ హాస్పిటల్ కు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. నంద్యాల మెడికల్ కళాశాలలో ఆసుపత్రి ఎక్కడ ఉందో జగన్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ కాలేజీ లోపల హాస్పిటల్ ఉంటే ఆహా ఓహో అని ప్రశంసించడమే కాకుండా శిల్పా రవిని శాలువాతో సన్మానించి బొకే కూడా ఇస్తామని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో మెడికల్ కాలేజీల పునాదుల పిల్లర్లు మాత్రమే నిర్మించారని, ఆ పద్ధతిలో కాలేజీ నిర్మించేందుకు 30 ఏళ్లు పడుతుందని శబరి అన్నారు.
పీపీపీ విధానంలో 8 నెలలలో కాలేజీల నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. పేద విద్యార్థుల కోసమే మెడికల్ కాలేజీ కడుతున్నామని చెప్పిన జగన్...బీ కేటగిరీలో ప్రైవేటీ కాలేజీల స్థాయిలో 60 లక్షల నుంచి కోటి రూపాయలు ఫీజు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తల్లితో మాట్లాడని వారు విగ్రహాలతో మాట్లాడుతున్నారని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అందుకే మెడికల్ కాలేజీలో కూడా విగ్రహం పెట్టారని, మనం కూడా ఆ విగ్రహంతో మాట్లాడదామని చురకలంటించారు. వైసీపీ నేతలకు లండన్ లో ట్రీట్మెంట్ సరిపోవడం లేదని, ఏపీలోని ప్రతి ఆసుపత్రిలో సైకియాట్రిక్ వార్డులను డెవలప్ చేయాలని మంత్రి సత్య కుమార్ ను శబరి కోరారు.