2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఏపీలోని వైసీపీ సహా దేశంలోని పలు పార్టీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అటువంటిదేమీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరోపణలను కొట్టి పారేసింది. మరోవైపు బీహార్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, గుర్తులతోపాటు కలర్ ఫోటోలను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రాబోతుందని తెలిపింది. ఓటర్లు మరింత స్పష్టంగా అభ్యర్థి ముఖాన్ని చూసేందుకు కలర్ లో ఫోటో ముద్రించనున్నారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్ పై 20 ఎంఎం సైజులో అభ్యర్థి కలర్ ఫోటో, 40 ఎంఎం సైజులో పార్టీ సింబల్ ఉండబోతుంది.
అంతేకాకుండా అభ్యర్థుల సీరియల్ నంబర్లను 30 సైజ్ ఫాంట్ ఇస్తూ బోల్డ్ లో అక్షరాలు పెద్దవిగా ముద్రించబోతున్నారు. అభ్యర్థుల పేర్లు, నోటా ఆప్షన్ కు ఇదే నిబంధన వర్తించబోతోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గత 6 నెలల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం 28 మార్పులు తీసుకొచ్చింది. తాజాగా కలర్ ఫోటో ముద్రణ కూడా వాటిలో భాగమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గతంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, సీరియల్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే ఉండేవి.