ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని నారాయణ చెప్పారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతాహీ సేవ అవగాహన కార్యక్రమంలో నారాయణతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొన్నారు.
నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతహీ సేవా కార్యక్రమం జరగనుందని ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ ఈ బైక్ నడిపారు. త్వరలో ఏపీలో రీసైక్లింగ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. శ్రమదానం కార్యక్రమం త్వరలో చేపడతామని తెలిపారు. నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసిన ఖాళీ స్థలాలను శుభ్రపరచడం వంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామన్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలుతోపాటు పలు ప్రధాన నగరాల్లో డంపింగ్ యార్డులు రాబోతున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, కానీ, 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి పోయిందని విమర్శించారు. 83 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామని, మరొక 2 లక్షల టన్నుల చెత్త మాత్రమే మిగిలి ఉందని, దాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. గ్రౌండ్ లెవెల్ లో మరొక 15 లక్షల టన్నుల చెత్త ఉంటుందని, దానిని డిసెంబర్ 31 నాటికి క్లియర్ చేస్తామని అధికారులు తనకు వెల్లడించారని అన్నారు. చెత్తరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.