ఎప్పటిలాగే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ సభ్యులు గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యులపై ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జీఎస్టీ వంటి సంస్కరణలు వైసీపీ వంటి పార్టీలకు అర్థం కావని, అది వారి ఖర్మ అని చంద్రబాబు విమర్శించారు. ప్రతి శాసనసభ్యుడు జీఎస్టీ సంస్కరణలపై అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ఆర్థిక పన్ను, సాంకేతిక సంస్కరణలకు తాను ఎప్పుడు ముందుంటానని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇది ఒక గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్కరణలకు మద్దతివ్వాలని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు పేదలకు ఉపయోగపడాలని, మధ్యతరగతి వారికి లాభం చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటికి, వ్యాపారికి పన్ను తగ్గింపు వివరాలు తెలియజేయాలని అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచారం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు.
జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ధరలు తగ్గుతాయని, వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని అన్నారు. ఆరోగ్యం, విద్య, ఆహారం వంటి రంగాల్లో ధరలు తగ్గడం ద్వారా ప్రజలకు ఉపశమనం ఉంటుందని, ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేల కోసమే కాదని, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీని ఒక అభ్యసన కేంద్రంగా చూడాలని, ఎక్కువ సమయం సభలో గడిపి సమస్యలను, సభ పనితీరును గమనించాలని కోరారు. మంత్రులు కూడా బాధ్యతగా సభ లోపలే ఉండాలని, అధికారులు గ్యాలరీలో ఉండాలని చంద్రబాబు సూచించారు.